China: భారత సైనికులతో ఘర్షణలో చైనా బలగాలు ఉపయోగించిన ప్రమాదకర ఆయుధాలు ఇవేనా..?
- వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనా బలగాల ఘర్షణ
- రెండు వైపులా ప్రాణనష్టం
- ప్రమాదకర ఆయుధాలతో రెచ్చిపోయిన చైనా సైనికులు!
లడఖ్ సమీపంలోని వాస్తవాధీనరేఖ వద్ద గాల్వన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య భీకర ఘర్షణ జరగడం తెలిసిందే. ఇరువైపులా పదుల సంఖ్యలో సైనికులు మృతి చెందినట్టు సమాచారం ఉంది. అయితే, ఈ దాడిలో చైనా సైనికులు ఇనుపరాడ్లు, కర్రలు ఉపయోగించినట్టు భారత సైన్యం ఇదివరకే తెలిపింది. ఆ రాడ్లకు ఇనుపమేకులు అమర్చి ఉన్నాయని, బేస్ బాల్ బ్యాట్లకు ఫెన్సింగ్ వైర్లు చుట్టి ఆయుధాలుగా వాడారని వార్తలు వచ్చాయి. తుపాకులు ఉపయోగించకుండానే పెద్దసంఖ్యలో ప్రాణనష్టం కలిగించడానికి ఇలాంటి మొరటు ఆయుధాలను సరిహద్దు విధుల్లో ఉన్న చైనా సైనికులు ఉపయోగించారన్న కథనాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
తాజాగా, చైనా సైనికులు గాల్వన్ లోయ ఘర్షణల్లో ఉపయోగించిన ఆయుధాలు ఇవేనంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత సైన్యానికి చెందిన ఓ సీనియర్ అధికారి ఆ ఫొటోలను తమ దృష్టికి తీసుకువచ్చినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ పేర్కొంది.