Sri Lanka: 2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక అమ్ముడుపోయింది: సంచలన ఆరోపణలు చేసిన శ్రీలంక మాజీ క్రీడల మంత్రి
- 2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక ఓటమి
- మ్యాచ్ ఫిక్సయిందన్న శ్రీలంక మాజీ మంత్రి
- ఆధారాలు చూపించాలన్న మాజీ ఆటగాళ్లు
శ్రీలంక క్రికెట్లో కొన్నాళ్లుగా ఫిక్సింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కొందరు మాజీలపై ఐసీసీ విచారణకు తెరదీసిందన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ క్రీడామంత్రి మహీందానంద అలుత్ గామగె సంచలన ఆరోపణలు చేశారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక అమ్ముడుపోయిందని అన్నారు. కొలంబోలోని స్థానిక టీవీ చానల్ సిరసాతో మాట్లాడుతూ, నాడు ముంబయి వాంఖెడే మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందని పేర్కొన్నారు.
"ఇవాళ మీకు నేను చెప్పబోయేది ఏంటంటే... మేం 2011 వరల్డ్ కప్ ను అమ్ముకున్నాం. నేను క్రీడలమంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయం చెప్పాను. శ్రీలంక దేశీయుడిగా నేనీ విషయం చెప్పకూడదు కానీ, తప్పడంలేదు. గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయాం. ఆ మ్యాచ్ ఫిక్స్ అయిందని కచ్చితంగా చెప్పగలను. ఈ విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమే" అంటూ అలుత్ గామగె స్పష్టం చేశారు. మాజీ క్రీడల మంత్రి వ్యాఖ్యలపై శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సయిందనడానికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
ఆయన వద్ద ఆధారాలు ఉంటే వాటిని ఐసీసీకి, అవినీతి నిరోధక విభాగానికి అందిస్తే వారు లోతుగా దర్యాప్తు జరుపుతారు అంటూ సంగక్కర తెలిపారు. జయవర్ధనే కూడా ఘాటుగా వ్యాఖ్యానిస్తూ, కొన్నిరోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో ఈ రాజకీయ సర్కస్ మొదలైందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఫిక్సింగ్ కు పాల్పడిన ఆటగాళ్ల పేర్లు, అందుకు తగిన ఆధారాలు ఏవి? అంటూ ప్రశ్నించారు.
2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారత్ ఆ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో ఛేదించి వరల్డ్ కప్ చేజిక్కించుకుంది.