Tamil Nadu: మూన్నాళ్ల ముచ్చటే... తమిళనాడులో మళ్లీ ఆగిపోయిన సీరియల్స్ షూటింగులు
- ఇటీవలే సీరియల్స్ షూటింగులను అనుమతించిన పళనిస్వామి
- మళ్లీ విజృంభించిన కరోనా మహమ్మారి
- ఈ నెలాఖరు వరకు పూర్తి లాక్ డౌన్
తమిళనాడులో టీవీ సీరియల్స్ షూటింగులకు ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి (వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త), బుల్లితెర కళాకారుల సంఘం నిర్వాహకురాలు ఖుష్బూ తదితరులు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి షూటింగులకు అనుమతిని సాధించారు. ప్రభుత్వ అనుమతితో వారం రోజుల పాటు షూటింగులు జోరుగా సాగాయి. అయితే, కరోనా ఒక్కసారిగా విజృంభించడంతో... పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో, చెన్నై సహా కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో ఈనెల 19 నుంచి మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను విధించారు. దీంతో అన్ని కార్యకలాపాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ నెలాఖరు వరకు ఈ జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ ను ప్రకటించడంతో టీవీ సీరియల్స్ షూటింగులు నిలిచిపోయాయి.