Corona Virus: పొరపాటున వెంటిలేటర్ ను తీసేసి, కూలర్ ను పెట్టిన బంధువు... కరోనా రోగి మరణం!
- ఆసుపత్రిలో వేడి పెరిగిందని కూలర్ తెచ్చిన కుటుంబీకుడు
- అరగంట పాటు ఆక్సిజన్ అందని స్థితిలో రోగి
- ఆపై సీపీఆర్ నిర్వహించినా దక్కని ప్రాణాలు
కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్న ఓ రోగి, తన కుటుంబ సభ్యుడి పొరపాటు కారణంగా మృత్యువాత పడిన ఘటన కోటలో జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతన్ని చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యుడు ఒకరు, వెంటిలేటర్ ప్లగ్ ను తీసేసి, ఎయిర్ కూలర్ ప్లగ్ ను పెట్టాడు. దీంతో అతను మరణించాడని, ఈ ఘటనపై విచారించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
జూన్ 13న అనారోగ్యంతో ఇతను మహారావ్ భీమ్ సింగ్ ఆసుపత్రికి రాగా, అతన్ని ఐసీయూలో చేర్చుకున్నారు. అదే వార్డులో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో, ముందు జాగ్రత్తగా ఇతనికి వెంటిలేటర్ ను అమర్చారు. ఈ వార్డులో వేడిమి పెరిగి, ఉక్కపోతగా ఉండటంతో, అతని కుటుంబీకుడు ఒకరు ఎయిర్ కూలర్ ను తెచ్చారు. దాని ప్లగ్ ను పెట్టడానికి సాకెట్ కోసం వెతుకుతూ, పొరపాటున వెంటిలేటర్ ను అన్ ప్లగ్ చేశాడు.
దాదాపు అరగంట తరువాత పొరపాటును గుర్తించిన అతను, డాక్టర్లకు సమాచారాన్ని ఇచ్చాడు. ఆ వెంటనే అతనికి సీపీఆర్ నిర్వహించినా, ప్రాణాలు మిగల్లేదు. ఈ ఘటనపై విచారించాలని తాము భావిస్తున్నా, అతని కుటుంబీకులు సహకరించడం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ సక్సేనా వెల్లడించారు.