New Delhi: ప్రైవేటు ఆసుపత్రికి సత్యేందర్ జైన్ తరలింపు... ప్లాస్మా థెరపీ!
- బుధవారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
- పరిస్థితి విషమించడంతో మ్యాక్స్ హాస్పిటల్ కు
- త్వరగా కోలుకోవాలని ప్రార్థించానన్న అమిత్ షా
బుధవారం కరోనా నిర్ధారణ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన శరీరంలో వైరస్ స్థాయి పెరిగిపోయి, పరిస్థితి విషమించగా, ప్లాస్మా థెరపీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆయనకు జ్వరం చాలా అధికంగా ఉందని, న్యుమోనియా పెరిగి, ఊపిరి తీసుకోలేకపోతున్నారని వైద్యులు వెల్లడించారు. "తాజా సీటీ స్కాన్ రిపోర్టులో ఆయన ఊపిరితిత్తుల్లో న్యుమోనియా ప్యాచెస్ పెరిగినట్టు కనిపించింది. ఆయన చాలా అలసిపోయి కనిపిస్తున్నారు. డాక్టర్ల సలహాలు పాటిస్తున్నారు" అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
ప్రస్తుతం సత్యేందర్ జైన్ కు దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్, సాకేత్ ఫెసిలిటీలో చికిత్స జరుగుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కూడా ఇదే విధమైన ట్వీట్ పెట్టారు.