WHO: విజృంభిస్తున్న మహమ్మారి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకర వ్యాఖ్యలు
- ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుంటోంది
- 24 గంటల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా లక్షా 50 వేల కరోనా కేసులు
- కఠిన నిబంధనలు అవసరమైనా లాక్డౌన్తో ప్రజలు విసిగిపోతున్నారు
గురు-శుక్రవారం మధ్య 24 గంటల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా లక్షా 50 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రెస్ అధనోమ్ ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుంటోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల ప్రజలను మరింత ఆందోళనలోకి నెట్టేశాయి. తాజాగా నమోదైన కేసుల్లో సగానికిపైగా రెండు అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోనే వెలుగుచూసినట్టు అధనోమ్ తెలిపారు.
చెలరేగిపోతున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే కఠిన నిబంధనలు అమలు చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. అయితే, ఇప్పటికే విధించిన లాక్డౌన్ కారణంగా ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోందని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రత చర్యలు తీసుకోవడం వంటి వాటిని తప్పనిసరిగా పాటిస్తే వైరస్ను కొంతవరకు దూరం పెట్టవచ్చని అధనోమ్ వివరించారు.