Mashrafe Mortaza: కరోనా బారిన పడిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్
- మాజీ కెప్టెన్ మష్రఫే మొర్తజాకు కరోనా పాజిటివ్
- జ్వరంతో బాధపడుతున్న మొర్తజా
- ప్రస్తుతం తన నివాసంలోనే క్వారంటైన్
కరోనా మహమ్మారి క్రీడా లోకాన్ని కూడా వదలడంలేదు. ఇటీవల పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్ రావడం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ సారథి మష్రఫే మొర్తజా కరోనా బారిన పడ్డాడు. గత కొన్నిరోజులుగా మొర్తజా అస్వస్థతతో బాధపడుతుండడంతో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో తన నివాసంలోనే క్వారంటైన్ లో ఉన్నాడు. దీనిపై మొర్తజా తమ్ముడు మొర్సాలిన్ బిన్ మొర్తజా మాట్లాడుతూ, తన సోదరుడు రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, ఢాకాలోని తమ నివాసంలోనే ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడని తెలిపాడు. శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించగా, ఇవాళ ఫలితం వచ్చిందని వెల్లడించాడు.
స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, మొర్తజా కుటుంబసభ్యులకు ఇంతకుముందే కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. మొర్తజా క్రికెటర్ మాత్రమే కాదు, బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడు కూడా. కాగా, బంగ్లాదేశ్ లో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి.