TV Seriels: రేపటి నుంచి తెలుగు టీవీ సీరియల్స్ తిరిగి మొదలు!
- లాక్ డౌన్ కారణంగా నిలిచిన షూటింగ్స్
- మూడు నెలల పాటు పాత ఎపిసోడ్లతో కాలం
- నిబంధనలు సడలించగానే తిరిగి షూట్
- రేపటి నుంచి పలు సీరియల్స్ కొత్త ఎపిసోడ్లు
లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన తెలుగు టీవీ సీరియల్స్ రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. 22 నుంచి అన్ని సీరియల్స్, రియాలిటీ షోల కొత్త ఎపిసోడ్స్ ప్రారంభమవుతాయని ఈటీవీ, జీ తెలుగు, మా టీవీ, జెమినీ టీవీ తదితర ప్రముఖ చానెళ్లన్నీ ప్రకటించేశాయి. దీంతో నాన్ స్టాప్ వినోదానికి మరోసారి తెరలేచినట్టే. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా సీరియల్ షూటింగ్స్ అన్నీ ఆగిపోగా, పాత ఎపిసోడ్లు, గతంలో తీసిన కార్యక్రమాలను టీవీ చానెల్స్ ప్రసారం చేస్తూ వచ్చాయన్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో లాక్ డౌన్ సమయంలో ఇళ్లలోనే ఉంటున్న ఆర్టిస్టులతో పలు రకాల వినోద కార్యక్రమాలను టీవీ చానెల్స్ ప్రసారం చేశాయి. జీ టీవీలో ప్రసారమయ్యే 'సరిగమప' 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా 'ఒకే రాగం ఒకే దేశం' పేరిట వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. ఈటీవీ, జెమినీ తదితరాల్లో గతంలో విజయవంతమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తూ వచ్చాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సీరియల్స్ షూటింగ్స్‌కు అనుమతి లభించగా, రూల్స్ అన్నింటిని పాటిస్తూ, సీరియల్స్ నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమాలన్నీ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి తమతమ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని రేణు దేశాయ్, సునయన, మంగ్లి, ప్రియదర్శి తదితరాలు నటించిన ప్రోమోలు ఇప్పటికే వైరల్ అయిన సంగతి తెలిసిందే.