Rains: రుతు పవనాలకు తోడైన ఉపరితల ఆవర్తనం... రెండు రోజులు వర్షాలు!
- రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకూ ఆవర్తనం
- నిన్న ఉత్తర కోస్తాలో వర్షాలు
- గత రాత్రి హైదరాబాద్ లో చిరు జల్లులు
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రాజస్థాన్ నుంచి మధ్య భారతావని మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించిందని అధికారులు తెలిపారు.
రుతుపవనాలకు తోడైన ఆవర్తనం, వాటిని మరింత చురుకుగా మార్చిందని, దీని ప్రభావంతో మంగళవారం వరకూ వర్షాలు కురుస్తాయని అన్నారు. కోస్తా, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని అన్నారు. కాగా, గడచిన 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గత రాత్రి చిరుజల్లులు కురిశాయి.