Andhra Pradesh: లాక్డౌన్ సడలింపు తర్వాత ఏపీలో పెరుగుతున్న కేసులు: వైద్య ఆరోగ్యశాఖ
- మార్చి 24కు ముందు రాష్ట్రంలో ఉన్నవి 8 కేసులే
- గత 20 రోజుల్లో 4,776 కేసులు నమోదు
- రాష్ట్రంలో ఇప్పటి వరకు 101 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మార్చి 24కు ముందు రాష్ట్రంలో 8 కేసులు మాత్రమే నమోదు కాగా, లాక్డౌన్ నిబంధనలు పూర్తిగా తొలిగించిన గత 20 రోజుల్లో ఏకంగా 4,776 కేసులు నమోదైనట్టు పేర్కొంది. మరోవైపు, రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి.
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల మధ్య 22,371 మందికి పరీక్షలు నిర్వహించారు. ఒక రోజులో ఈ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ పరీక్షల్లో 491 మందికి కరోనా సోకినట్టు తేలింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 6,52,377 మందికి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 8,452 కేసులు నమోదయ్యాయి. అలాగే, ఇప్పటి వరకు 4,111 మంది కోలుకున్నారు. 101 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 4,240 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.