cyber: నేటి నుంచి దేశంలో పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగే అవకాశం: కేంద్ర సర్కారు
- కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ సేవల పేరిట దాడులు
- వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం
- అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచన
- నకిలీ ఈ-మెయిల్స్ పంపే అవకాశం
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ సేవల పేరిట దేశంలో నేటి నుంచి అతి పెద్ద సైబర్ దాడులు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తెలిపింది. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
హ్యాకర్లు [email protected] వంటి ఈ-మెయిల్స్‌ను వినియోగిస్తూ ఇటువంటి చర్యకు పాల్పడవచ్చని భారతీయ కంప్యూటర్, అత్యవసర స్పందన సంస్థ (సెర్ట్ ఇన్) పేర్కొంది. కరోనాకు సంబంధించిన విషయాలను చూపుతూ, మభ్యపెడుతూ దేశంలోని వ్యక్తులు, సంస్థల సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేసే అవకాశం ఉందని తెలిపింది.
సర్కారు తరఫున ఆర్థిక సహాయంగా నగదు అందించే ప్రభుత్వ సంస్థలు, విభాగాల పేరిట హ్యాకర్లు దేశంలో ఫిషింగ్ దాడులకు దిగే అవకాశముందని తెలిపింది. భారత ప్రభుత్వ అధికారుల పేర్లతో నకిలీ ఈ-మెయిల్స్ పంపే అవకాశముందని చెప్పింది. ఇటువంటి ఈ-మెయిల్స్ వస్తే వాటిని క్లిక్ చేయొద్దని చెప్పింది.
హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉచిత కరోనా పరీక్షల పేరుతో లక్షలాది మందికి ఈ-మెయిల్స్ పంపాలని హ్యాకర్లు ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపింది. తెలిసిన వ్యక్తుల పేరిట వచ్చిన మెయిల్స్‌లోని యూఆర్ఎల్‌లను కూడా క్లిక్ చేయొద్దని హెచ్చరించింది. హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు యాంటీ వైరస్ టూల్స్ వంటి సేవలను వాడుకోవాలని చెప్పింది.