Eatala Rajender: జేపీ నడ్డా ఓ గల్లీ నాయకుడిలా మాట్లాడారు: ఈటల
- కరోనా అంశంలో బీజేపీ, తెలంగాణ సర్కారు మధ్య పరస్పర విమర్శలు
- తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తున్నారన్న జేపీ నడ్డా
- గుజరాత్ లో కరోనా తీవ్రతకు ప్రధాని బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించిన ఈటల
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ సర్కారుకు బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దేశంలో చిన్న రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కంటే తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా మరణాల రేటు కంటే తెలంగాణలో కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉందన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని నిన్న జరిగిన వర్చువల్ సభలో వ్యాఖ్యానించారు.
దీనిపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. జేపీ నడ్డా వ్యాఖ్యలు సరికావదని హితవు పలికారు. జాతీయనేత అయిన జేపీ నడ్డా ఓ గల్లీ నాయకుడిలా మాట్లాడినట్టు అర్థమవుతోందని అన్నారు. కరోనా సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉందని, అయినా, గుజరాత్ లో కరోనా తీవ్రతకు ప్రధాని బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందే కరోనా విషయంలో అప్రమత్తమైంది తెలంగాణ రాష్ట్రమేనని స్పష్టం చేశారు.