Sun: ముగిసిన సూర్యగ్రహణం... ఆలయాల్లో సంప్రోక్షణలు
- గుజరాత్ లోని ద్వారకలో మొదలైన గ్రహణం
- అసోంలోని డిబ్రూఘర్ లో ముగింపు
- మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూర్తిస్థాయిలో కనువిందు
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన సూర్యగ్రహణం ముగిసింది. గుజరాత్ లోని ద్వారకలో మొదలై చివరిగా అసోంలోని డిబ్రూఘర్ లో 3.04 గంటలకు పరిసమాప్తమైంది. అంతకుముందు ఉదయం 9 గంటల తర్వాత ప్రారంభమైన సూర్యగ్రహణం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూర్తిస్థాయిలో కనువిందు చేసింది. సూర్యుడి మధ్య భాగాన్ని చంద్రుడు కప్పేశాడు. దాంతో సూర్యుడు ఓ వలయ రూపంలో దర్శనిమిచ్చాడు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్న సమయాల్లో సూర్యగ్రహణం కనిపించింది.
ఇక, గ్రహణ ఘడియలు ముగియడంతో దేశవ్యాప్తంగా ఆలయాల్లో సంప్రోక్షణలు మొదలయ్యాయి. ఒక్క శ్రీకాళహస్తి ఆలయం తప్ప దేశంలోని అన్ని ఆలయాలు మూతపడ్డాయి. సూర్యగ్రహణం ముగిసిన నేపథ్యంలో ఆలయాలు మళ్లీ తెరుచుకున్నాయి. సంప్రోక్షణ ప్రక్రియ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.