Police: తూర్పుగోదావరిలో ఒకేసారి అదృశ్యమైన ఐదుగురు యువకుల కేసును ఛేదించిన పోలీసులు
- మంగళగిరి పోలీస్ స్టేషన్ లో యువకులు
- టిక్ టాక్ వీడియోలపై మోజు
- డబ్బు సంపాదించేందుకు వెళుతున్నామని లేఖ
తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు ముస్లిం యువకులు అదృశ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. ఓకేసారి ఐదుగురు యువకులు ఆచూకీ లేకుండా పోవడం సంచలనం సృష్టించింది. యువకుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే పోలీసులు కొద్ది వ్యవధిలోనే వారి ఆచూకీ తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ ఐదుగురు యువకులు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. టిక్ టాక్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో వారు ఇల్లు వదిలి వెళ్లినట్టు తెలుసుకున్నారు.
అర్థరాత్రి అందరూ నిద్రపోతున్న సమయాన రెండు బైక్ లపై వీరు విజయవాడ వైపు వెళ్లారు. వారిలో ఒకరు ఇంట్లో లేఖ వదిలి వచ్చినట్టు గుర్తించారు. తాము డబ్బు సంపాదించడానికి వెళుతున్నామని, తమకోసం ఆందోళన చెందవద్దని తెలిపాడు. వారు విజయవాడ దిశగా వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు ఆ మార్గంలో పీఎస్ లను అప్రమత్తం చేశారు. దాంతో మంగళగిరి పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిని మంగళగిరి నుంచి తీసుకువచ్చేందుకు తూర్పు గోదావరి పోలీసులు బయల్దేరి వెళ్లారు.