Principal: కరోనా నేపథ్యంలో ఓ స్కూల్ ప్రిన్సిపాల్ దయనీయ స్థితి... తోపుడుబండిపై టిఫిన్లు అమ్ముకుంటున్న వైనం!

School principal sells idlis and vadas due to corona pandemic

  • ఖమ్మంలో స్కూల్ ప్రిన్సిపాల్ గా వేల జీతం అందుకున్న రాంబాబు
  • లాక్ డౌన్ తో మూతపడిన స్కూలు
  • రోడ్డున పడ్డ ప్రిన్సిపాల్
  • తోపుడు బండి ఆసరాగా కుటుంబపోషణ

కరోనా సంక్షోభంతో జీవితాలే మారిపోతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం పట్టణంలో నిన్నటివరకు స్కూల్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించిన వ్యక్తి లాక్ డౌన్ కారణంగా ఉపాధి పోవడంతో చేసేది లేక ఓ తోపుడు బండిపై టిఫిన్లు విక్రయించుకుంటూ బతుకుతున్నారు. భార్య సాయంతో ఇడ్లీ, దోసె, వడ వంటి అల్పాహారాలు అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఆయన పేరు మార్గాని రాంబాబు. ఖమ్మంలోని మిల్లీనియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ గా నెలకు రూ.22 వేలు జీతం అందుకున్న ఆయన లాక్ డౌన్ దెబ్బకు స్కూలు మూతపడడంతో ఇంటికే పరిమితమయ్యారు. స్కూలు యాజమాన్యం జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేయడంతో రాంబాబు దిగాలు పడ్డాడు.

అయితే లాక్ డౌన్ సడలింపులు మొదలయ్యాక రూ.2000తో ఓ తోపుడు బండి కొనుక్కుని, దానిపై ఇడ్లీలు, వడలు, దోసెలు అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నాడు. రోజుకు కనీసం రూ.200 వస్తున్నాయని, దాంతో తన ఇద్దరు పిల్లలను, తల్లిని పోషించుకుంటున్నానని రాంబాబు తెలిపాడు. ఒకప్పుడు తాను ప్రిన్సిపాల్ ను అన్న భేషజాలను వదిలేసి కుటుంబ పోషణకోసం కష్టపడుతున్నాడు.

రాంబాబు మాత్రమే కాదు, ప్రైవేటు స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అనేకమంది పరిస్థితి ఇలాగే ఉంది. కొందరు బీమా పాలసీలు కట్టిస్తూ ఉపాధి పొందుతుండగా, మరికొందరు సొంత పొలాల్లో పనులు చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News