Srikakulam District: యువతిని పెళ్లాడి లక్షలాది రూపాయలు దోచేసిన నకిలీ ఎస్సై!

Fake SI cheated woman in srikakulam dist

  • శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో ఘటన
  • గ్రూప్-1కు సిద్ధమవుతున్నానంటూ భార్య తండ్రి నుంచి రూ.12.80 లక్షలు దండుకున్న వైనం
  • భార్య నగలు తాకట్టుపెట్టి మరో లక్ష గుంజిన నిందితుడు

ఎస్సైగా పనిచేస్తున్నట్టు నకిలీ గుర్తింపు కార్డుతో యువతిని నమ్మించి పెళ్లాడి, ఆపై లక్షలాది రూపాయలు కాజేశాడో నకిలీ పోలీసు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొర్లకోటకు చెందిన పైడి రామచంద్రరావు పోలీసు దుస్తుల్లో ఫొటో తీసుకున్నాడు. ఎస్సైగా పనిచేస్తున్నట్టు నకిలీ గుర్తింపు కార్డు సృష్టించి విశాఖపట్టణంలోని గవర కంచరపాలేనికి చెందిన యువతికి వల వేశాడు. ఆమెను ప్రేమలోకి దింపి గతేడాది 19న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నాడు.

రోజుల తరబడి ఇంటి పట్టునే ఉంటున్న భర్తను ఉద్యోగానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించింది. తాను సస్పెండ్ అయ్యానని ఒకసారి, ఆరోగ్యం బాగాలేదని ఒకసారి సాకులు చెప్పాడు. అంతేకాదు, గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమవుతున్నానంటూ భార్య తండ్రి నుంచి రూ. 12.80 లక్షలు తీసుకున్నాడు. అది సరిపోదన్నట్టు, భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి మరో లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఆమె సోదరి వద్ద నుంచి మరికొంత బంగారం తీసుకున్నాడు.

మరోపక్క, తన పెళ్లి విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి వరకు తన తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ తర్వాత వారికి తమ పెళ్లి విషయం తెలిసినప్పటి నుంచి తనను వేధించడం మొదలుపెట్టాడని, కులం పేరుతో దూషిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు ఎస్సైగా చెప్పుకుంటూ మోసం చేస్తున్న అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News