Manmohan Singh: మీరు ప్రధాని... ఓ మాటనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి: మోదీకి మన్మోహన్ సింగ్ సూచన
- అఖిలపక్ష సమావేశంలో మోదీ వ్యాఖ్యలపై మండిపాటు
- ప్రజాస్వామ్యం మోదీ కార్యాలయంలోనే ఆగిపోయింది
- ట్విట్టర్ లో ప్రకటన విడుదల చేసిన మన్మోహన్ సింగ్
ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఏవైనా పదాలను వాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. గత శుక్రవారం జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు విమర్శలను కొని తెచ్చిన వేళ, ఈ ఉదయం మన్మోహన్ సింగ్, ఓ ప్రకటన విడుదల చేశారు. "సరిహద్దులో భారత భూభాగాన్ని కాపాడేందుకు కల్నల్ బి.సంతోష్ బాబు, మన జవాన్లు చేసిన ప్రాణ త్యాగాలను తక్కువ చేసి చూడవద్దు. అది ప్రజల నమ్మకాన్ని వంచించినట్టే" అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో మనం చరిత్రాత్మక కూడలిలో నిలబడివున్నాం. మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చర్యలు భావి తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని మరువరాదని సూచించిన మన్మోహన్, మన ప్రజాస్వామ్యం ప్రధాని కార్యాలయంలోనే ఆగిపోయింది. జాతి భద్రత, సరిహద్దు అంశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించే వేళ, జాతి భద్రతను మనసులో ఉంచుకుని మాట్లాడాలని అన్నారు.
కాగా, అఖిలపక్ష సమావేశంలో "భారత సరిహద్దుల్లోకి ఎవరూ రాలేదు. మన పోస్టులను ఎవరూ ఆక్రమించలేదు" అని మోదీ వ్యాఖ్యానించగా, మరి భారత సైనికులు ఎందుకు చంపబడ్డారు? వారిని ఎక్కడ చంపారు? అంటూ రాహుల్ గాంధీ మండిపడిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభించింది. నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు విపక్ష నేతలు విరుచుకుపడగా, ఇప్పుడు మన్మోహన్ సింగ్ సైతం విమర్శలు గుప్పించడం గమనార్హం.