Aravinda De Silva: 2011 వరల్డ్ కప్ ఫైనల్ పై అనుమానాలు తొలగిపోవాలంటే విచారణ జరపాల్సిందే: అరవింద డిసిల్వా
- 2011 వరల్డ్ కప్ ఫైనల్ ఫిక్సయిందని లంక మాజీ మంత్రి వ్యాఖ్యలు
- మండిపడుతున్న మాజీ క్రికెటర్లు
- ఆ మాజీ మంత్రి విశ్వసనీయతలేని వ్యక్తి అంటూ డిసిల్వా విమర్శలు
ఇటీవల శ్రీలంక క్రీడల శాఖ మాజీ మంత్రి మహీందానంద అలుత్ గామగె 2011 వరల్డ్ కప్ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆ ఫైనల్లో శ్రీలంక జట్టు భారత్ కు అమ్ముడుపోయిందంటూ ఆరోపించారు. దీనిపై శ్రీలంక మాజీ క్రికెటర్లు భగ్గుమంటున్నారు.
తాజాగా, లంక బ్యాటింగ్ దిగ్గజం అరవింద డిసిల్వా ఈ అంశంపై స్పందించాడు. మాజీ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో 2011 వరల్డ్ కప్ ఫైనల్ పై సందేహాలు కలుగుతున్నాయని, ఇప్పుడా అనుమానాలు తొలగిపోవాలంటే విచారణ జరపాల్సిందేనని అన్నాడు. ప్రజలకు ఇలాంటి విషయాలను ఎల్లప్పుడూ దూరంగా ఉంచలేమని, ఈ వ్యవహారంలో ఐసీసీ, బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ బోర్డు జోక్యం చేసుకుని విచారణ జరపాలని కోరాడు.
ఎందుకంటే, లంక మాజీ మంత్రి మహీందానంద ఓ విశ్వసనీయత లేని వ్యక్తి అని, అతని వ్యాఖ్యలతో ఇప్పుడు ఆటగాళ్ల కీర్తి, ప్రతిష్ఠలు ప్రమాదంలో పడ్డాయని తెలిపాడు. మరోవైపు, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్ కు 2011 వరల్డ్ కప్ విజయం ఎంతో వన్నె తెచ్చిందని, అలాంటి ఘనతను తక్కువ చేసి చూపే ప్రయత్నం జరుగుతున్నందున దీనిపై భారత ప్రభుత్వం కూడా దృష్టిసారించాలని డిసిల్వా విజ్ఞప్తి చేశాడు.