Sushant Singh Rajput: సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ, సినీ నటుడు మనోజ్ తివారి డిమాండ్
- ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సుశాంత్ ఎదిగాడు
- సుశాంత్ ను ఆపేందుకు కొన్ని బాలీవుడ్ శక్తులు యత్నించాయి
- నెపోటిజం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని బీజేపీ ఎంపీ, భోజ్ పురి సూపర్ స్టార్ మనోజ్ తివారి డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన పాట్నాలోని సుశాంత్ కుటుంబసభ్యులను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలను చేస్తుంటే.. కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందనిపిస్తోందని చెప్పారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టమేనని అన్నారు.
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సుశాంత్ కష్టపడి, మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడని మనోజ్ తివారి చెప్పారు. 16 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయిన సుశాంత్... ఏనాడు తడబడలేదని అన్నారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. హీరోగా నిలదొక్కుకున్న సుశాంత్ ను ఆపేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించాయని... బాలీవుడ్ లోని నెపోటిజం కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని... ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
సుశాంత్ మరణానంతరం బాలీవుడ్ ప్రముఖులు పలువురు పలు విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలో బయట వ్యక్తులను ఎదగనీయకుండా, అణచి వేస్తున్నారని ఆరోపించారు. సంతకం చేసిన ఏడు సినిమాలను కూడా ఆపేశారని చెప్పారు. బాలీవుడ్ లోని కొందరి వల్ల సుశాంత్ నరకయాతన అనుభవించాడని తెలిపారు.