Pattabhiram: విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేస్తారనుకుంటే నిజాలు చెప్పిన నా ఇంటికి పోలీసులను పంపారు: టీడీపీ నేత పట్టాభి
- నిన్న 108 స్కాం అంటూ వివరాలు వెల్లడించిన పట్టాభి
- డీజీపీ చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని నేడు డిమాండ్
- తనపై నిఘా పెట్టినా భయపడేది లేదన్న పట్టాభి
108 అంబులెన్స్ ల నిర్వహణ అంశంలో కుంభకోణం జరిగిందని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన సంస్థకు దోచిపెట్టారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించడం తెలిసిందే. అయితే, ఇవాళ పట్టాభిని హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చిందని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో, పట్టాభి మీడియాతో మాట్లాడారు.
"విజయసాయిరెడ్డిని 108 స్కాంలో అరెస్ట్ చేస్తారని భావించాను. కానీ నిజాలు చెప్పిన నా ఇంటికే పోలీసులను పంపారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 108 అంబులెన్స్ ల నిర్వహణలో రూ.300 కోట్ల మేర అవినీతి జరిగిందని పునరుద్ఘాటించారు. పాత కాంట్రాక్టు రద్దు చేసి విజయసాయిరెడ్డి అల్లుడి సంస్థకు కట్టబెట్టారని ఆరోపించారు. విజయసాయిరెడ్డిని, ఆయన అల్లుడు రోహిత్ ను అరెస్ట్ చేయాలని పట్టాభి డిమాండ్ చేశారు. డీజీపీ నిష్పాక్షికంగా వ్యవహరించి, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. తనపై పోలీసులు నిఘా పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.