Karimnagar District: కాకతీయ కాల్వలో ముగ్గురి జలసమాధిపై వీడిన చిక్కుముడి!
- ఈ ఏడాది జనవరి 27న ఘటన
- వ్యాపారి సత్యానారాయణ రెడ్డి కుటుంబం జలసమాధి
- ఆత్మహత్యేనని తేల్చిన పోలీసులు
కరీంనగర్ సమీపంలోని కాకతీయ కాల్వలో ఈ ఏడాది జనవరిలో కారు బోల్తా పడిన ఘటన అప్పట్లో పెను సంచలనమైంది. కరీంనగర్‌కు చెందిన వ్యాపారి సత్యనారాయణరెడ్డి, ఆయన భార్య రాధ, కుమార్తె వినయశ్రీ జలసమాధి అయ్యారు. ఈ ఘటనపై పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. హత్య అని, ప్రమాదమని, ఆత్మహత్య అని రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. మిస్టరీగా మారిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా విచారణ అంశాలను వెల్లడించారు. జనవరి 27న జరిగిన ఈ ఘటన ప్రమాదం కాదని, ఆత్మహత్యేనని పేర్కొన్నారు.
సత్యనారాయణరెడ్డి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం తమ విచారణలో తేలిందని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరిలో ఆయన నిర్వహిస్తున్న ఎరువుల దుకాణంలో ఆత్మహత్య లేఖ, డైరీలు లభించాయని పేర్కొన్నారు. జీవితంపై విరక్తితో ఉన్నట్టు తెలిపేలా ఉన్న ఆ లేఖను సత్యనారాయణ రెడ్డే రాసినట్టు ఫోరెన్సిక్ అధికారులు ధ్రువీకరించారు. ఈ విషయం ఆధారంగా ఆ రోజు జరిగింది ప్రమాదం, హత్యల వంటివి కాదని, ఆత్మహత్యేనని నిర్ధారణకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు.