Apple IOS 14: పిక్చర్ ఇన్ పిక్చర్, కార్ ప్లే, ఇన్ స్టాల్ కాకుండానే యాప్స్... యాపిల్ కొత్త ఫోన్ వినూత్న ఫీచర్లు!
- లైవ్ స్ట్రీమింగ్ విధానంలో 'డబ్ల్యూడబ్ల్యూడీసీ 2020'
- కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్
- కొత్త ఫీచర్లను వివరించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెయిడ్ ఫెడిరిగీ
యాపిల్ కొత్త ఫోన్ల పరిచయం గత రాత్రి వినూత్నంగా జరిగింది. ప్రతి సంవత్సరమూ వేలాది మంది మధ్య కొత్త స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించే యాపిల్, ఈ సంవత్సరం మాత్రం కరోనా కారణంగా లైవ్ స్ట్రీమింగ్ కు పరిమితమైంది. 'డబ్ల్యూడబ్ల్యూడీసీ 2020' కార్యక్రమాన్ని సంస్థ సీఈఓ టిమ్ కుక్ తన ప్రసంగంతో ప్రారంభించారు. కరోనాపై పోరులో ముందు నిలిచిన యోధులకు అభినందనలు తెలిపారు. తాము జాతి వివక్షను ఏ మాత్రమూ సమర్థించబోమని స్పష్టం చేశారు. ఆ తరువాత సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెయిడ్ ఫెడిరిగీ 'ఐఓఎస్ 14' విశేషాలను వెల్లడించారు.
వీటిల్లో అతి ముఖ్యమైనది ఇంతకాలమూ ఇంటెల్ చిప్ సెట్ ఆధారిత మ్యాక్ లను తయారు చేసిన సంస్థ, ఇకపై సొంత చిప్ సెట్లను మాత్రమే వినియోగించనుంది. ఇక కొత్త ఫోన్లలోని వినూత్న ఫీచర్ల విషయానికి వస్తే, తొలుత చెప్పుకోవాల్సింది యాప్ లైబ్రరీ. ఇది ఓ ఫోల్డర్ సిస్టమ్. మనకు కావాల్సిన యాప్స్ ను ఆర్గనైజ్ చేసుకుని ఫోల్డర్లలో పెట్టుకోవచ్చు. వీటిని స్క్రీన్ ను స్వైప్ చేయడం ద్వారా తెరచుకోవచ్చు. తాత్కాలికంగా అవసరం లేని యాప్ పేజస్ ను దాచుకునే సౌకర్యం కూడా ఉంటుంది. గతంతో పోలిస్తే, మరింత మెరుగ్గా విజట్స్ ను ఆర్గనైజ్ చేసుకుని, వాటిని హోమ్ స్క్రీన్ కు చేర్చుకునే సౌలభ్యం కూడా వుంది. 'స్మార్ట్ స్టాక్ విజట్' పేరిట వచ్చిన ఫీచర్ సాయంతో ఆటోమేటిక్ గా విజట్ లను మార్చుకునే వీలుంటుంది.
తదుపరి ఐఓఎస్ 14లోని ముఖ్యమైన ఫీచర్ 'పిక్చర్ ఇన్ పిక్చర్'. దీని ప్రత్యేకత ఏంటంటే, ఏదైనా వీడియోను ఓపెన్ చేసి, యాప్ ను మినిమైజ్ చేస్తే, చిన్న విండోలో వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఈ వీడియోను స్వైప్ చేసి, స్క్రీన్ పై నుంచి తొలగించి, ఆడియోను వింటూ ఉండవచ్చు కూడా. 'సిరి' పేరిట తయారైన కొత్త యాప్ ద్వారా వివిధ భాషల అనువాదాన్ని ఆఫ్ లైన్ లో కూడా చేసుకోవచ్చు. అనువాదాలను ఫోన్ ను అడ్డంగా తిప్పి (లాండ్ స్కేప్ మోడ్) సులువుగా చూసుకోవచ్చు. ఆ తరువాత మెసేజ్ అప్ డేట్, ఎమోజీ కస్టమైజేషన్ ఆప్షన్, ఇన్ లైన్ రిప్లయ్ టూ ఐమెసేజ్ సదుపాయాలూ ఈ సిస్టమ్ కలిగివుంటుంది. అంటే, వ్యక్తులకైనా, గ్రూప్ కైనా మెసేజ్ పెట్టి, దాన్ని మనకు కావాల్సిన సమయంలో డెలివరీ చేసుకునే వీలును ఐఓఎస్ 14 దగ్గర చేసింది.
ఇదే సమయంలో యాపిల్ మ్యాప్స్, సైక్లింగ్ డైరెక్షన్స్ తదితరాల్లో మెరుగైన అనుభూతి కలిగేలా మార్పు చేర్పులను చేశారు. ఈవీ రూటింగ్ పేరిట కొత్త ఫీచర్ ను జోడించారు. ఇక ఈ ఫోన్ ను ఇన్ కార్ ఎంటర్ టెయిన్ మెంట్ గా మార్చేందుకు 'కార్ ప్లే' మోడ్ ను యాపిల్ తీసుకువచ్చింది. దీని సాయంతో ఐఫోన్ ను కారుకు తాళంగా వాడుకోవచ్చు. వచ్చే నెలలో బీఎండబ్ల్యూ ఆవిష్కరించనున్న కొత్త కారులో కార్ ప్లేను వినియోగించుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైన అప్ డేట్ ఏంటంటే, యాప్ ను ఇన్ స్టాల్ చేయకుండానే, వాడుకునే సౌకర్యం. ఇందుకోసం యాప్ క్లిప్స్ అనే ఫీచర్ ను యాపిల్ ప్రవేశపెట్టింది.
ఆపై ఐపాడ్ ఓఎస్ 14 విశేషాలను ఫెడిరిగీ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే... హ్యాండ్ రైటింగ్ సపోర్ట్ ను మరింతగా మెరుగు పరిచేందుకు ఐపాడ్ ఓఎస్ 14 పేరిట మరో కొత్త ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా స్క్రీన్ స్పేస్ ను గరిష్ఠంగా వినియోగించుకోవచ్చు. అంటే, సైడ్ బార్ ను తొలగించుకుని యాప్స్ వాడవచ్చు. దీంతో ఐపాడ్ మరింత పెద్ద స్క్రీన్ తో ఉన్న అనుభూతి కలుగుతుంది. కుడివైపు కింది భాగంలో 'సిరి' బటన్ ను కొత్తగా తీసుకుని వచ్చారు. ఏదైనా ఇన్ కమింగ్ కాల్ వస్తే, ఐపాడ్, లేదా ఐఫోన్లలో స్క్రీన్ మొత్తాన్నీ ఆక్రమించవు. పై భాగాన చిన్న విండోలో మాత్రమే కనిపిస్తాయి.
దీని తరువాత యాపిల్ పెన్సిల్ ను సంస్థ పరిచయం చేసింది. హ్యాండ్ రైటింగ్ సపోర్ట్ కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. స్క్రిబిల్ ఫీచర్ సాయంతో చేతి రాతను టెక్ట్స్ గా మార్చుకోవచ్చు. చేతి రాతలోని కొంత భాగాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు కూడా. ఇదే సమయంలో ఎయిర్ పాడ్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేశామని, ఈ కొత్త ఫీచర్ తో వినియోగదారులు వాడుతున్న ఐఫోన్, ఐ పాడ్, మాక్ తదితరాల్లోకి ఆటోమేటిక్ గా మారిపోతూ ఉండవచ్చని ఫెడిరిగే తెలియజేశారు. అంటే, మీరు మ్యాక్ లో సినిమా చూస్తున్న వేళ, ఐఫోన్ కు కాల్ వస్తే, ఆటోమేటిక్ గా అది మ్యాక్ స్క్రీన్ పై చిన్న విండోలో కనిపిస్తుంది. వీటితో పాటు టీవీ ఓఎస్ 14, మ్యాక్ ఓఎస్ 11, వాచ్ ఓఎస్ 7ల విశేషాలను కూడా ఆయన వెల్లడించారు.