Jagan: జగన్ నోట కొత్త జిల్లాల మాట.. 12 కొత్త జిల్లాలకు సీఎం సుముఖం!
- కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
- కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్న జగన్
- ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా ఏర్పాటయ్యే అవకాశం
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జగన్ మాట్లాడుతూ... ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి నుంచి ఈ మాట రాగానే అలర్ట్ అయిన అధికారులు... తమ వైపు నుంచి కసరత్తును ప్రారంభించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలపై దృష్టిని సారించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై గతంలోనే అధికారులతో జగన్ చర్చించిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి నుంచి దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని అందరూ భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. తాజాగా కొత్త జిల్లాల అంశాన్ని జగన్ మరోసారి ప్రస్తావించడంతో... ఈ అంశంపై ఆయన చాలా సీరియస్ గానే ఉన్నట్టు అర్థమవుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర విజభన తర్వాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని పాత 10 జిల్లాలను ఏకంగా 33 జిల్లాలుగా విభజించింది.