Bengaluru: బెంబేలెత్తుతున్న బెంగళూరు.. మరోసారి పూర్తి స్థాయి లాక్ డౌన్ దిశగా అడుగులు!
- బెంగళూరులో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
- ఇప్పటికే నాలుగు ప్రాంతాలను సీల్ చేశామన్న ఆరోగ్య మంత్రి
- పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్ డౌన్ తప్పదని వ్యాఖ్య
బెంగళూరులో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. నగరంలో మరోసారి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలని అక్కడి బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ, ఇప్పటికే నగరంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నాలుగు ప్రాంతాలను సీల్ చేశామని చెప్పారు. కేసులు ఇదే విధంగా పెరిగితే బెంగళూరులో లాక్ డౌన్ విధిస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి ఎడ్యూరప్పతో మాట్లాడతానని తెలిపారు. కోవిడ్ టాస్క్ ఫోర్స్, అధికారులు, మేధావుల సలహాలు సూచనలను కూడా తీసుకుని, తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.