Kamineni Srinivas: రాజకీయ వేడిని పుట్టిస్తున్న పార్క్ హయత్ వ్యవహారం.. కామినేని శ్రీనివాస్ స్పందన!
- సొంత పార్టీకి చెందిన సుజనా చౌదరిని కలవడంలో తప్పేముంది?
- నేను వెళ్లిన సమయానికి నిమ్మగడ్డ అక్కడకు వచ్చారు
- వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు
పార్క్ హయత్ హోటల్ లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లు భేటీ అయ్యారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ముగ్గురూ కుట్రలు పన్నుతున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ... సుజనా చౌదరి, తాను ఒకే పార్టీకి చెందిన వ్యక్తులమని చెప్పారు. తామిద్దరం కలుసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. పార్క్ హయత్ హోటల్ లో సుజనా చౌదరి కార్యాలయం ఉందని... తాను ఆయనను కలిసేందుకు వెళ్లిన సమయంలోనే నిమ్మగడ్డ రమేశ్ అక్కడకు వచ్చారని చెప్పారు. రమేశ్ అక్కడకు వస్తున్నట్టు కూడా తనకు తెలియదని... అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న భేటీ కాదని తెలిపారు. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదని అన్నారు.
తన జీవితంలో ఏనాడూ కోర్టుకు వెళ్లలేదని.... కానీ, నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించడంతో తాను కోర్టులో పిటిషన్ వేశానని కామినేని చెప్పారు. తనను దొంగ అంటూ ఓ వైసీపీ నేత విమర్శించారని... ఆయన పేరును తాను పలకనని... తాను ఎందుకు దొంగో చెప్పాలని అన్నారు. నీతి, నిజాయతీలు తన బలమని చెప్పారు. చీఫ్ సెక్రటరీలు, డీజీపీలుగా పని చేసిన ఎంతో మందితో తనకు పరిచయం ఉందని... తాను దొంగ అని వారిలో ఎవరితోనైనా చెప్పించాలని సవాల్ విసిరారు. ఒక సాధారణ విషయాన్ని వైసీపీ నేతలు వివాదాస్పదం చేస్తున్నారని విమర్శించారు.
మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి సునీల్ దేవధర్, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకున్నారని కామినేని చెప్పారు. జరిగిన విషయాన్ని తాను వారికి వివరించానని... ఇందులో తప్పేమీ లేదని వారు కూడా అన్నారని తెలిపారు. తన మూలాల గురించి కూడా ఒక నాయకుడు మాట్లాడారని... తన మూలాలు బీజేపీలోనే ఉన్నాయని... బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ బీజేపీలోనే ఉంటానని చెప్పారు. బీజేపీ అధిష్ఠానం ఏం చెపితే అదే చేస్తానని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తనకు సంబంధం లేదని చెప్పారు.