Sujana Chowdary: నా రాజకీయాలు పారదర్శకంగా వుంటాయి.. నేనేదైనా చెప్పే చేస్తా: నిమ్మగడ్డను కలవడంపై సుజనా చౌదరి
- నిమ్మగడ్డ, కామినేని నా వద్దకు వచ్చినందుకే నానా హైరానా
- మేం కలిస్తే తప్పేంటి? మీకు అంత భయం దేనికి?
- ఇంతకీ ఆయనను మీరు కమిషనర్ గా గుర్తించారా?
- ఎస్‌ఈసీ విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా?
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో తాను సమావేశమైన వీడియోను వైసీపీ బయట పెట్టడంపై బీజేపీ నేత సుజనా చౌదరి మరోసారి స్పందించారు. 'నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గారు, కామినేని శ్రీనివాస్ గారు పార్క్ హయత్ లోని నా కార్యాలయానికి వచ్చినందుకే నానా హైరానా పడుతున్నారు. మేం కలిస్తే తప్పేంటి? మీకు అంత భయం దేనికి? కంగారొద్దు. నా రాజకీయాలు పారదర్శకంగా వుంటాయి. నేనేదైనా చెప్పే చేస్తా' అని చెప్పారు.
'రమేశ్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నామని మీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా వుండి ఎంపీని కలవడంలో మతలబేంటని మీ సాక్షి మీడియా ఆశ్చర్యపోతుంది. ఇంతకీ ఆయనను మీరు కమిషనర్ గా గుర్తించారా? కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా?' అని ప్రశ్నించారు.