Donald Trump: ట్రంప్ ట్వీట్ కు నోటీసులు ఇచ్చిన ట్విట్టర్
- వాషింగ్టన్ లో అటానమస్ జోన్ ఉండబోదని ట్రంప్ ట్వీట్
- ఎవరైనా ప్రయత్నిస్తే సీరియస్ ఫోర్స్ ను రంగంలోకి దింపుతామని హెచ్చరిక
- ప్రజలకు హాని కలిగించేలా ట్వీట్ ఉందన్న ట్విట్టర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మరోసారి షాకిచ్చింది. ఆయనకు ప్రజా ప్రయోజన నోటీసులు జారీ చేసింది. వాషింగ్టన్ లో అటానమస్ జోన్ ను స్థాపించేందుకు ప్రయత్నిస్తే సీరియస్ ఫోర్స్ ను రంగంలోకి దింపుతామని ట్రంప్ తాజాగా ట్వీట్ చేశారు.
తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం వాషింగ్టన్ లో అటానమస్ జోన్ అనేది ఉండబోదని చెప్పారు. నిరసనకారులు లూటింగ్ కు పాల్పడితే... షూటింగ్ ఉంటుందని హెచ్చరించారు. ట్రంప్ చేసిన ఈ ట్వీట్ పై ట్విట్టర్ అభ్యంతరం తెలిపింది. తమ సంస్థ విధానాలను ఉల్లంఘించారంటూ ప్రజా ప్రయోజనాల నోటీసును జారీ చేసింది. ట్రంప్ చేసిన ట్వీట్ ప్రజలకు హాని కలిగించే విధంగా ఉందని పేర్కొంది. ట్వీట్ పై వార్నింగ్ లేబుల్ ఉంచింది.
అయితే, ట్విట్టర్ తీరును వైట్ హౌస్ తప్పుపట్టింది. శాంతిభద్రతలను ఎవరూ అతిక్రమించకుండా ఉంచేందుకే ట్రంప్ అలా ట్వీట్ చేశారని తెలిపింది. అధ్యక్షుడి వ్యాఖ్యలను వినే హక్కు ప్రజలకు ఉందని... ఆ తర్వాత ఆయనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించుకుంటారని పేర్కొంది.
ట్రంప్ ట్వీట్ పై ట్విట్టర్ చర్యలు తీసుకోవడం ఇది నాలుగో సారి. మరోవైపు, ట్రంప్ స్టేట్ మెంట్ పై ఫేస్ బుక్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తమ విధానాలను ట్రంప్ ఉల్లంఘించలేదని తెలిపింది.