Sajjala Ramakrishna Reddy: బీజేపీ ముసుగు వేసుకున్న టీడీపీ నేతలతో నిమ్మగడ్డ రమేశ్ భేటీ కుమ్మక్కు కాదా?: సజ్జల
- సుజనా, కామినేని బీజేపీ నేతలు అని టీడీపీ చెబుతోంది
- ఈ వ్యవహారాన్ని వర్ల రామయ్య ఎందుకు తన భుజాల పైకి ఎత్తుకున్నారు
- నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎలా ఉంటారు?
పార్క్ హయత్ లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ల భేటీపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, బీజేపీ ముసుగు వేసుకున్న టీడీపీ నేతలతో నిమ్మగడ్డ రమేశ్ భేటీ కుమ్మక్కు కాదా? అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపించారు. పార్క్ హయత్ హోటల్ లో చోటుచేసుకున్న వ్యవహారాన్ని కోర్టుల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటారా? అని ప్రశ్నించారు.
సుజనా, కామినేని బీజేపీ మనుషులని టీడీపీ చెపుతోందని... అలాంటప్పుడు కేంద్రానికి వినతిపత్రాన్ని తయారు చేసేందుకే మీటింగ్ పెట్టుకున్నారంటూ ఈ రహస్య భేటీని టీడీపీ నేత వర్ల రామయ్య తన భుజాల మీదకు ఎందుకెత్తుకున్నారని ప్రశ్నించారు. రాజకీయ నాయకులతో కలిసి ఇలాంటి పన్నాగాలు చేసే నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎలా ఉంటారని అన్నారు.
తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసమని ఓ ప్రబుద్ధుడు అన్నాడని... స్టార్ హోటల్ లో ఎందుకు కలిశారంటే... వీరు ముగ్గురూ చెపుతున్న సమాధానాలు కూడా ఇలాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ 6వ ఫ్లోర్ వరకు లిఫ్ట్ లో వెళ్లి అక్కడి నుంచి 8వ ఫ్లోర్ లిఫ్ట్ వరకు నడుచుకుంటూ వెళ్లి వారితో ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించారు.