Kadapa District: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నాడని.. కిరాతకంగా చంపేశాడు!
- రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు వడ్డీకి ఇచ్చిన వెంకటరమణయ్య
- రూ. 30 లక్షలు ఇవ్వాల్సిన ఎర్రగుంట్ల నగర పంచాయతీ మాజీ మున్సిపల్ చైర్మన్
- మొండెం నుంచి తలను వేరుచేసి 50 కిలోమీటర్ల దూరంలో పడేసిన వైనం
వడ్డీకి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కడప జిల్లా ఎర్రగుంట్ల పంచాయతీ పరిధిలోని మహాత్మానగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటరమణయ్య ఐసీఎల్ సిమెంటు కంపెనీలో పనిచేసి రిటైరయ్యాడు. ఈ సందర్భంగా వచ్చిన డబ్బుకు మరికొంత కలిపి వడ్డీకి అప్పులు ఇచ్చాడు.
ఈ క్రమంలో ఎర్రగుంట్ల నగర పంచాయతీ మాజీ మున్సిపల్ చైర్మన్ ముసలయ్యకు ఇచ్చిన మొత్తం, వడ్డీతో కలిపి రూ. 30 లక్షలు అయింది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలంటూ గత కొంతకాలంగా ముసలయ్యపై వెంకటరమణ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు.
దీంతో రమణయ్యను చంపేస్తే డబ్బులు కట్టాల్సిన పని ఉండదని భావించిన ముసలయ్య అందుకు ప్రణాళిక రచించాడు. అందులో భాగంగా ఈ నెల 20న మహాత్మాగాంధీ నగర్‌లోని తన ఇంటికి రావాలంటూ వెంకటరమణయ్యకు ముసలయ్య కబురుపెట్టాడు. అతడు వచ్చిన వెంటనే మరికొందరు కిరాయి వ్యక్తులతో కలిసి వెంకటరమణయ్యను దారుణంగా చంపేశాడు.
అనంతరం మొండెం నుంచి తలను వేరుచేశాడు. మొండాన్ని ఇంట్లో ప్రాంగణంలోనే పాతిపెట్టిన ముసలయ్య.. తలను మాత్రం ఓ స్టీల్ డబ్బాలో పెట్టి తన బంధువుల సాయంతో 50 కిలోమీటర్ల దూరంలోని గువ్వల చెరువు ఘాట్ వద్దకు తీసుకెళ్లి అడవిలో పడేశాడు.
మరోవైపు, రెండు రోజులుగా తన అన్న కనిపించకపోవడంతో కంగారు పడిన ఆయన తమ్ముడు రామయ్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా ముసలయ్యను అదుపులోకి తీసుకున్నారు. వెంకటరమణయ్యను తానే హత్య చేసినట్టు విచారణలో ముసలయ్య అంగీకరించాడు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరికొందరిని పోలీసులు విచారిస్తున్నారు.