Karnataka: నేటి నుంచి కర్ణాటకలో టెన్త్ పరీక్షలు... తల్లిదండ్రుల గుండెల్లో దడ!
- రాష్ట్రంలో 10 వేలు దాటిన కేసుల సంఖ్య
- పరీక్షలకు పంపరాదని పలువురి నిర్ణయం
- అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామన్న విద్యా మంత్రి
నేటి నుంచి కర్ణాటకలో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండగా, దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను మిగతా రాష్ట్రాల మాదిరిగానే రద్దు చేయాలన్న డిమాండ్ వచ్చినా, యడియూరప్ప సర్కారు పరీక్షలు జరిపించేందుకే నిశ్చయించింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10 వేల మార్క్ ను దాటేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కాగా, పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని, ఎటువంటి ఆందోళనా అవసరం లేదని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సురేశ్ కుమార్ భరోసా ఇచ్చారు. వేలాది ఎగ్జామినేషన్ సెంటర్లను ఇప్పటికే పరిశుభ్రం చేశామని, తాను స్వయంగా తనిఖీలు చేశానని ఆయన అన్నారు. "పరీక్షలను జరిపించడం ప్రభుత్వ విధిగా భావించాం. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఓ మైలురాయి. పరీక్షలు జరిపించే విషయంలో ఎంతో మందిని సంప్రదించాం. పరీక్షల నిర్వహణ విధానం గురించి హైకోర్టుకు తెలిపి, అనుమతి కూడా తీసుకున్నాం" అని సురేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, ప్రతి రూములో 18 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నామని, గది పెద్దదిగా ఉంటే 20 మందిని కూర్చోబెడతామని వెల్లడించిన ఆయన, భౌతిక దూరం పాటించడాన్ని తప్పనిసరి చేశామని, ప్రతి విద్యార్థికీ థర్మల్ పరీక్షను జరిపించి లోనికి పంపిస్తామని అన్నారు. ఎవరైనా విద్యార్థులు మాస్క్ లను మరచిపోయి వస్తే, పరీక్షా కేంద్రంలోనే వాటిని ఇస్తామని, శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. తల్లిదండ్రులు పాఠశాల గేట్ల వద్ద భౌతికదూరం పాటించి అధికారులతో సహకరించాలని కోరారు.
అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరోపక్క తల్లిదండ్రుల్లో ఆందోళన మాత్రం తొలగలేదు. మహమ్మారి వైరస్ ఎక్కడ తమ పిల్లలకు సోకుతుందోనని లక్షలాది మంది పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ పరీక్షలను కనీసం రెండు, మూడు నెలలు వాయిదా వేసుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. చాలామంది తమ విద్యార్థులను పరీక్షలకు పంపరాదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.