IIT Bombay: ఈ సంవత్సరం క్లాసులను రద్దు చేసిన బాంబే ఐఐటీ.. కేవలం ఆన్ లైన్ క్లాసులు మాత్రమే!
- విద్యార్థుల భద్రతకే తొలి ప్రాధాన్యం
- సెమిస్టర్ పూర్తిగా ఆన్ లైన్ మాధ్యమంలోనే
- పేద విద్యార్థులకు సాయం చేయండి
- ఐఐటీ డైరెక్టర్, ప్రొఫెసర్ సుభాషిశ్ చౌదరి
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ, ముంబయిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఒక్క ముఖాముఖి తరగతిని కూడా నిర్వహించేది లేదని తేల్చి చెప్పింది. ఇండియాలో ఇటువంటి నిర్ణయం తీసుకున్న తొలి మేజర్ ఇనిస్టిట్యూట్ బాంబే ఐఐటీ కావడం గమనార్హం. విద్యార్థుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని, అందువల్లే ఈ సంవత్సరం తరగతులను రద్దు చేశామని బాంబే ఐఐటీ డైరెక్టర్, ప్రొఫెసర్ సుభాషిశ్ చౌదరి వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు అన్ని వర్గాలతో సుదీర్ఘ చర్చలు జరిపామని అన్నారు.
ఇక ప్రస్తుత సెమిస్టర్ లో విద్యార్థులకు ఏ విధంగా సాయపడవచ్చన్న విషయమై చర్చిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తదుపరి సెమిస్టర్ పూర్తిగా ఆన్ లైన్ మాధ్యమంలోనే జరుగుతుందని, ఈ విషయంలో మరో ఆలోచన లేదని ఆయన వెల్లడించారు. కాగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను జూలైలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల క్లాసులు ప్రారంభం కావాల్సి వుంది.
"ఇక్కడ విద్యను అభ్యసించేందుకు వచ్చే వారిలో అత్యధికులు ఆర్థికంగా అంత స్తోమత లేనివారే. వారందరికీ ఆన్ లైన్ క్లాసుల కోసం ల్యాప్ టాప్ లు, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు తదితర ఐటీ హార్డ్ వేర్ అవసరం ఉంది. వారికి సాయం చేయాలని కోరుతున్నాను" అని కూడా సుభాషిశ్ చౌదరి విజ్ఞప్తి చేశారు. వీరందరికీ సాయం చేయాలంటే దాదాపు రూ. 5 కోట్ల వరకూ ఖర్చవుతుందని వెల్లడించిన ఆయన, దాతలు సాయపడాలని కోరారు.