Team India: బీసీసీఐ లిఖితపూర్వక హామీ ఇస్తేనే మా ఆటగాళ్లను పంపుతాం: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
- ఇండియాలో జరిగే ఐసీసీ టోర్నీలకు మా ఆటగాళ్లను పంపుతాం
- గతంలో మా ఆటగాళ్లకు భారత్ అనుమతులు ఇవ్వలేదు
- వీసాల మంజూరుపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాలి
భారత్ లో వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్, 2023లో జరిగే వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆటగాళ్ల భద్రతకు సంబంధించి బీసీసీఐ లిఖితపూర్వక హామీని ఇస్తేనే... తమ ఆటగాళ్లను పంపుతామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు ఐసీసీకి విన్నవించింది. పాక్ ఆటగాళ్ల వీసాల మంజూరుపై క్లారిటీ ఇవ్వాలని కోరింది. ఈ వివరాలను పాక్ క్రికెట్ బోర్డు సీఈవో వసీమ్ ఖాన్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తెలిపారు.
బీసీసీఐను సంప్రదించాలని ఐసీసీని కోరామని వసీమ్ ఖాన్ చెప్పారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది దీన్ని ఎక్కడ జరపాలనే అంశంపై ఐసీసీ చర్చించనుంది. ఈ ఈవెంట్ ను ఆస్ట్రేలియాలో నిర్వహించాలా? లేదా భారత్ లో నిర్వహించాలా? అనే విషయంపై ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు 2023లో జరగాల్సిన వన్డే ప్రపంచకప్ భారత్ నిర్వహించనుంది.
ఈ నేపథ్యంలో వసీమ్ ఖాన్ స్పందిస్తూ భారత్ లో జరిగే ఐసీసీ టోర్నమెంట్లకు తమ ఆటగాళ్లను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే, ఆటగాళ్ల భద్రతపై లిఖితపూర్వక హామీని బీసీసీఐ ఇవ్వాలని కోరారు. భారత్ లో జరిగే ఈవెంట్లకు గతంలో పాక్ ఆటగాళ్లకు అనుమతులు ఇవ్వలేదని... ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లకు భారత్ నుంచి తాము ముందుగానే హామీని కోరుతున్నామని చెప్పారు. భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ లపై ఇప్పట్లో ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం లేదని తెలిపారు.