KCR: సినిమా వాళ్లకు అడవి సీన్ కావాలంటే అప్పట్లో నర్సాపూరే వచ్చేవారు!: సీఎం కేసీఆర్
- ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
- నర్సాపూర్ లో అల్లనేరేడు మొక్క నాటిన వైనం
- నర్సాపూర్ లో మళ్లీ అడవి పెంచాలని పిలుపు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆయన అల్ల నేరేడు మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, 1985 ప్రాంతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మార్గం నుంచే కారులో వెళుతుండేవాడ్నని, అప్పట్లో నర్సాపూర్ అంతా అటవీప్రాంతమని చెప్పారు. ఏ మూల చూసినా సినిమా షూటింగులు జరుగుతుండేవని, సినిమా వాళ్లకు అడవి సీన్ కావాల్సి వస్తే నర్సాపూరే వచ్చేవాళ్లని వెల్లడించారు.
అయితే, ఇప్పుడా అడవి అంతా ఏమైపోయింది? అని కేసీఆర్ ఆవేదనతో ప్రశ్నించారు. అడవుల నరికివేత వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోయాయని తెలిపారు. మెదక్ జిల్లాలో ఎక్కడ పడకపోయినా, నర్సాపూర్ లో వర్షం పడేదని, ఇప్పుడా పరిస్థితి లేదని, మనం చేజేతులా చేసుకున్నదేనని అన్నారు. ఇప్పుడు దీన్ని బాగు చేసుకోవాల్సింది మనమే అంటూ స్పష్టం చేశారు. నర్సాపూర్ అడవి మళ్లీ వస్తుందా? రాదా? అనే మొండిపట్టుదల చూపాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.