Galwan Valley: గాల్వన్ ఘర్షణల్లో మరో భారత సైనికుడి వీరమరణం
- ఇటీవల లడఖ్ వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ
- నదిలో పడిన సహచరులను కాపాడేయత్నంలో మరో జవాను మృతి
- 21కి పెరిగిన మృతుల సంఖ్య
లడఖ్ వద్ద గాల్వన్ లోయలో కొన్నిరోజుల కిందట భారత్, చైనా బలగాల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలు ప్రాణనష్టానికి దారి తీశాయి. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు మరణించినట్టు సైన్యం పేర్కొంది. తాజాగా సచిన్ విక్రమ్ మోరే అనే మరో సైనికుడు కూడా వీరమరణం పొందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
సచిన్ మోరే గాల్వన్ లోయ ఘర్షణల సమయంలో నదిలో పడిపోయిన ఇద్దరు సహచరులను కాపాడే ప్రయత్నంలో తాను కన్నుమూశాడు. సచిన్ మోరే మరణాన్ని సైన్యం ధ్రువీకరించింది. దాంతో గాల్వన్ లోయ మృతుల సంఖ్య 21కి పెరిగింది. సచిన్ మోరే స్వస్థలం మహారాష్ట్రలోని మాలేగావ్ తాలూకా సాకురి గ్రామం.