Pawan Kalyan: జీడి పంట నిత్యావసరం కాదని మద్దతు ధర ప్రకటించకపోవడం సరికాదు: పవన్ కల్యాణ్
- జీడి రైతులు అప్పుల పాలవుతున్నారని వెల్లడి
- పెట్టుబడి ఖర్చులు కూడా రావడంలేదన్న పవన్
- బస్తాకు రూ.15 వేలు ఇవ్వాలని సూచన
ఏపీ ప్రభుత్వం జీడి పంట రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది జీడి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని, అప్పులపాలయ్యే పరిస్థితి వచ్చిందని తెలిపారు. జీడి పంట నిత్యావసరం కాదని మద్దతు ధర ప్రకటించకపోవడం సరికాదని హితవు పలికారు. గత సంవత్సరం బస్తా జీడి పిక్కల ధర రూ.14 వేల వరకు ఉంటే, ఈ సంవత్సరం అది రూ.8 వేలు మాత్రమే పలుకుతోందని వెల్లడించారు.
ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 65 వేల ఎకరాల్లో జీడి పంట సాగులో ఉందని, చేసిన అప్పులు తీర్చేందుకు రైతులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని పవన్ వివరించారు. అయితే, కరోనా కారణంగా పనులు లేకపోవడంతో స్వస్థలాలకు వచ్చేస్తున్నారని, కానీ ఇక్కడ వేసిన జీడి పంటకు పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. దళారుల నుంచి అప్పులు చేస్తున్న రైతన్నలు చివరికి పంటను కూడా వారికే అమ్ముకుంటున్నారని, దాంతో గిట్టుబాటు ధరను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పొగాకు వంటి వాణిజ్య పంటల కోసం బోర్డులు ఏర్పాటు చేస్తున్న సర్కారు, జీడి పంట కొనుగోలు కోసం అదే తరహాలో చర్యలు తీసుకోవాలని కోరారు. బస్తా జీడిపిక్కలకు రూ.15 వేలు ప్రకటిస్తే రైతులకు ఊరట లభిస్తుందని తెలిపారు.