Uttar Pradesh: 400 ఏళ్ల నాటి యూపీ పురాతన పరిశ్రమ... ఇప్పుడు ఉనికిని కాపాడుకోలేక కుదేలు!
- షహరాన్ పూర్ ప్రాంతంలో విస్తరించిన వుడ్ కార్వింగ్ ఇండస్ట్రీ
- దాదాపు 2 లక్షల మందికిపైగా ఉపాధి
- లాక్ డౌన్ కారణంగా మూతబడ్డ పరిశ్రమలు
- నిబంధనలు సడలించినా ఆర్డర్లు లేక ఇబ్బందులు
ఉత్తరప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతం... దాదాపు 4 శతాబ్దాల క్రితమే ఇక్కడ వడ్రంగి పరిశ్రమ రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. నిన్న మొన్నటి వరకూ దాదాపు 2 లక్షల మంది ఈ పనుల్లో ఉపాధిని పొందుతూ వచ్చారు. ఇప్పుడు లాక్ డౌన్ తో మొత్తం పరిశ్రమ కుదేలైంది. ఉనికిని కాపాడుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది.
అహ్సాన్ అహ్మద్ (42) షహరాన్ పూర్ లోని ఓ చెక్కబొమ్మల తయారీ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఓ కళాకారుడిగా చెక్కను కళాఖండాలుగా తీర్చిదిద్దడంలో సిద్ధహస్తుడు. ఆహ్మద్ తన వంశంలో ఈ వృత్తిలో ఉన్న మూడో తరం వ్యక్తి. మార్చిలో కరోనా మహమ్మారి భయంతో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత, పనులు ఆగిపోయాయి. ఆరుగురు ఉన్న తన కుటుంబాన్ని మార్చి వరకూ చక్కగా లాక్కుని వచ్చిన అహ్మద్, ఇప్పుడు నానా అవస్థలూ పడుతూ, పూట గడిచేందుకు ఆటో నడుపుతున్నాడు. ఆటో నడిపినా ఇల్లు గడవడం కష్టమవుతుందన్న ఆలోచనలో ఉన్న అతను ఇప్పుడు ఓ పండ్ల దుకాణం తెరవాలని చూస్తున్నాడు.
అహ్మద్ ఒక్కడే కాదు... ఎన్నో సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో ఉపాధిని పొందుతున్న వేలాది మంది పరిస్థితి ఇదే. రెండు నెలల లాక్ డౌన్ తరువాత కంపెనీలను తెరిచినా, ఆర్డర్లు రాక పని లేదని, దీంతో రోజువారీ కూలీ లభించడం లేదని వారంతా వాపోతున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే ఆర్డర్లు 70 నుంచి 80 శాతం వరకూ తగ్గిపోయాయని స్థానిక వ్యాపారులు అంటున్నారు.
సాలీనా దాదాపు రూ. 400 కోట్లకు పైగా టర్నోవర్ ఉండే స్థానిక వడ్రంగి పరిశ్రమలో గడచిన నెల రోజుల వ్యవధిలో రూ. 5 కోట్ల వ్యాపారం కూడా జరగలేదు. "గతంలో నెలకు రూ. 12 వేల వరకూ సంపాదించే వాళ్లం. నేనిప్పుడు రూ. 6 వేలు కూడా ఇంటికి తీసుకుని వెళ్లలేకున్నాను. అప్పులు చేసి బతుకుతున్నాం. ఆర్టిస్టులు, కార్మికులు, సరఫరాదారులు, ఇతర ఉద్యోగులతో కళకళలాడుతూ ఉండే పరిశ్రమ కేంద్రాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి" అని అహ్మద్ వ్యాఖ్యానించాడు.
ఇప్పుడు కార్మికులను కూడా తగ్గించేశారని, ఇది చాలా క్లిష్టమైన సమయమని ఇక్కడి ఉద్యోగులు అంటున్నారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినా, స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే, తమ మనుగడ మరింత కష్టమవుతుందని వాపోతున్నారు.