Woman: అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన యువతి... ఆమెను 'అతడు' అని తేల్చిన వైద్యులు!
- పశ్చిమ బెంగాల్ లో అరుదైన ఘటన
- పొత్తికడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువతి
- ఆమెలో అంతర్గతంగా వృషణాలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు
- వృషణాలకు క్యాన్సర్ సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడి
పశ్చిమ బెంగాల్ లోని భిర్భమ్ ప్రాంతానికి చెందిన ఓ యువతి 30 ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా గడిపేసింది. కానీ, ఇటీవల పొత్తికడుపులో విపరీతమైన నొప్పి వస్తుండడంతో ఆసుపత్రికి వెళ్లగా, ఆ యువతి ఓ పురుషుడు అని తేల్చారు. ఆ యువతిలో వృషణాలు అంతర్గతంగానే ఉండిపోయాయని, ఇప్పుడా వృషణాలకు క్యాన్సర్ సోకిందని డాక్టర్లు గుర్తించారు.
భిర్భమ్ కు చెందిన ఆ యువతికి తొమ్మిదేళ్ల కిందట పెళ్లయింది. పొత్తికడుపు నొప్పి ముదరడంతో కోల్ కతాలోని నేతాజి సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ హాస్పిటల్ కు వెళ్లింది. డాక్టర్ అనుపమ్ దత్తా, డాక్టర్ సౌమెన్ దాస్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆశ్చర్యపోయారు. ఆమెలో వృషణాలు అంతర్గతంగానే ఉండిపోయాయని, స్త్రీ సంబంధ హార్మోన్ల ఆధిక్యత వల్ల ఓ స్త్రీలో ఉండాల్సిన జననావయవాలు, ఇతర భాగాలు ఏర్పడ్డాయని తెలుసుకున్నారు. డాక్టర్ అనుపప్ దత్తా మాట్లాడుతూ, ఇలాంటి అరుదైన స్థితి 22 వేల మందిలో ఒక్కరికి వస్తుంటుందని తెలిపారు.
"చూడ్డానికి స్త్రీలాగానే ఉంటుంది. గొంతు, అభివృద్ధి చెందిన వక్షోజాలు, బహిర్ జననేంద్రియాలు అన్నీ మామూలుగా ఏర్పడ్డాయి. కానీ గర్భసంచి, అండాలు ఆమెలో లేవు. ఇంతవరకు ఆమె రుతుస్రావం ఎరుగదు" అని వివరించారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తే లోపల కుచించుకుపోయిన స్థితిలో వృషణాలు కనిపించాయి. బయాప్సీ చేయగా, క్యాన్సర్ సోకినట్టు వెల్లడైంది. దీన్ని సెమినోమా అని పిలుస్తారు" అని తెలిపారు.
ప్రస్తుతం ఆ యువతికి కీమోథెరపీ ఇస్తుండగా, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరో ఆశ్చర్యకర అంశం ఏమిటంటే... ఆ యువతి ఓ సోదరి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఆమె వయస్సు 28 సంవత్సరాలు. వైద్యులు అనుమానంతో ఆమెకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా, జన్యుపరంగా ఆమె ఓ పురుషుడు అని, కానీ భౌతికంగా స్త్రీ అని తెలుసుకున్నారు. ఆమెలోని ఈ పరిస్థితిని ఆండ్రోజెన్ ఇన్ సెన్సిటివిటీ సిండ్రోమ్ అని గుర్తించారు.
ఈ పరిస్థితిపై వైద్యులు మరింత లోతుగా విశ్లేషించగా, ఆ అక్కాచెల్లెళ్ల పూర్వీకుల్లో కొందరికి ఇదే పరిస్థితి ఉన్నట్టు వెల్లడైంది. ఇలాంటి అరుదైన స్థితికి జన్యువులే కారణమని డాక్టర్ అనుపమ్ దత్తా అభిప్రాయపడ్డారు.