Andhra Pradesh: పలాస ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్!
- మానవత్వం చూపాల్సిన సమయంలో ఈ తీరు బాధించింది
- మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదు
- ట్విట్టర్ వేదికగా సీఎం
శ్రీకాకుళం జిల్లా పలాస ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంత మంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదు’ అని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా అప్పటికే నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. దీంతో అధికారులు ఆ విషయాన్ని ఫోన్ చేసి చెప్పారు. అంతే.. అప్పటి వరకు వెంట ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మృతదేహాన్ని అక్కడే వదిలేసి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
విషయం తెలిసిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ సిబ్బందికి పీపీఈ కిట్లు తొడిగించి మృతదేహాన్ని జేసీబీతో శ్మశానానికి తరలించారు. జేసీబీతో మృతదేహాన్ని తరలించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. సీఎంఓ ఆదేశాల మేరకు విచారణ జరిపిన కలెక్టర్ నివాస్ ఇందుకు బాధ్యులైన మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్.రాజీవ్‌లను సస్పెండ్ చేశారు.