Raghurama Krishna Raju: జగన్ కు, నాకు మధ్య చిచ్చు పెట్టొద్దు.. జనాలు చూస్తున్నారు: విజయసాయిపై రఘురామకృష్ణరాజు ఫైర్
- నాపై పత్రికల్లో దొంగరాతలు రాయిస్తున్నారు
- ఎంపీనైన నన్ను శిక్షించాలనుకుంటున్నారు
- వీలైతే నోటీసులు వెనక్కి తీసుకోండి
తన ప్రాణాలకు ముప్పుందని... ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి చెప్పానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు రక్షణ కల్పించాలని కోరానని... ఇదే విషయమై కేంద్ర హోంశాఖ సెక్రటరీని కూడా కలుస్తానని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ప్రవర్తించేలా, దాడులకు తెగబడేలా కుట్రలు చేస్తున్నారని అన్నారు. తనపై విజయసాయిరెడ్డి కక్ష కట్టారని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, విజయసాయిపై నిప్పులు చెరిగారు.
'అయ్యా విజయసాయిరెడ్డి గారూ... నేనొక క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను. క్రమశిక్షణ కలిగిన ఎంపీని. మీరు పత్రికల్లో నాపై ఎన్ని దొంగరాతలు రాయించినా... ఆ దొంగరాతలను చూశారా, చూశారా అంటూ పదేపదే చెప్పినా... నేను ఏనాడు పార్టీని కానీ, పార్టీ అధినేత జగన్ ను కానీ వ్యతిరేకించలేదు. ఈ విషయాన్ని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన నన్ను శిక్షించాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి' అంటూ రఘురామ కృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అధినేత జగన్ కు, తనకు మధ్య మనస్పర్థలు కలిగించవద్దని, చిచ్చు పెట్టొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నానని విజయసాయిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని... వీలైతే మీరు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలని మీకు మీడియా ముఖంగా చెపుతున్నానని అన్నారు.