ED: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ నివాసంలో ఈడీ సోదాలు
- సందేశర స్కాంలో అహ్మద్ పటేల్ కుటుంబీకులు!
- అహ్మద్ పటేల్ తనయుడు, అల్లుడిపై ఆరోపణలు
- ఈడీ సమన్లు అందుకున్న అహ్మద్ పటేల్
సందేశర గ్రూప్ (స్టెర్లింగ్ బయోటెక్) కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కుటుంబీకులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సందేశర గ్రూప్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రూ.5 వేల కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా, అహ్మద్ పటేల్ తనయుడు, అల్లుడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో అహ్మద్ పటేల్ నివాసంలో ఈ మధ్యాహ్నం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. అంతకుముందు, ఈడీ అధికారులు ఆయనకు సమన్లు పంపినా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి వెళ్లలేకపోయారు. తన వయసు 65 ఏళ్లకు పైబడినందున బయటికి రాలేకపోతున్నానని అహ్మద్ పటేల్ ఈడీ కార్యాలయానికి బదులు పంపారు. దాంతో ఈడీ అధికారులు ఆయన నివాసానికి వచ్చి సోదాలు జరపడంతో పాటు స్టేట్ మెంట్ కూడా రికార్డు చేసినట్టు తెలుస్తోంది.