Ajay Kallam: కేంద్రమంత్రి నిర్మల వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి: అజేయ కల్లం
- ఏపీ పరిస్థితులపై నిన్న నిర్మల వ్యాఖ్యలు
- ఏపీ విద్యుత్ టారిఫ్ లపై విమర్శలు
- ఏ రాష్ట్రంలోనూ రూ.7 కు తక్కువగా ఇండస్ట్రియల్ టారిఫ్ లేదన్న కల్లం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు తమకెంతో ఆశ్చర్యం కలిగించాయని అన్నారు. ఏపీలో పారిశ్రామిక విద్యుత్ టారిఫ్ రూ.7.65గా ఉందని, 2017లో ఉన్న టారిఫ్ నే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని వెల్లడించారు. కానీ కేంద్రమంత్రి ఏపీలో ఇండస్ట్రియల్ విద్యుత్ టారిఫ్ రూ.9 అంటున్నారని, పైగా కేంద్రంలో రూ.2.75కే విద్యుత్ ఇస్తుంటే, ఏపీలో అంత రేటా అని వ్యాఖ్యానించడం తమకు సర్ ప్రైజింగ్ గా ఉందని కల్లం వ్యాఖ్యానించారు.
నిర్మల చెబుతున్న రూ.9 ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడంలేదని అన్నారు. రూ.2.75 చొప్పున విద్యుత్ టారిఫ్ ఎవరు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు వాస్తవాలను ప్రతిబింబించడంలేదని విమర్శించారు. పరిశ్రమలకు ఏ రాష్ట్రం కూడా రూ.7 కంటే తక్కువకు విద్యుత్ ఇవ్వడంలేదని వివరించారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో ఉన్న అప్పు రాష్ట్ర విభజన నాటికి రూ.28,400 కాగా, ఇప్పుడది రూ.70 వేల కోట్లకు చేరిందని అజేయ కల్లం వెల్లడించారు. అందుకు కారణం సరైన విధానాలు అనుసరించకపోవడమేనని తెలిపారు.
"అందుకు ఉదాహరణ చెబుతాను. జెన్ కో సారథ్యంలో కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం కట్టిస్తున్నారు. దానిలో ఒక్క మెగావాట్ ఖరీదు రూ.8.5 కోట్లు. ప్రపంచంలో ఇలాంటి రేట్లు ఎక్కడా వినుండరు. దాని నిర్మాణ సమయంలో జరిగిన అవినీతి వల్లో, మరే ఇతర కారణం వల్లో మెగావాట్ కు రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల నష్టం వస్తుంది. జీవితాంతం ఈ విద్యుత్ కేంద్రం పనిచేసినా అది రూ.4కి, రూ.5కి పవర్ సప్లై చేయలేదు. ఆ ప్రాజెక్టు కోసం రూ.20 వేల కోట్లు అప్పు తీసుకున్నారు. ఈ విధమైన తప్పుల వల్ల రాష్ట్రం మరింత నష్టాల్లోకి వెళ్లింది" అని వివరించారు.
అంతకుముందు, వారసత్వ రాజకీయాల గురించి నిర్మల చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నేరుగా ఎన్నిక కానివాళ్లు, ఒక్కరోజు కూడా ఎమ్మెల్యేగా పనిచేయని వాళ్లు, ఏ అర్హత లేనివాళ్లు, కొడుకులో, కూతుర్లో అవడం వల్ల నేరుగా మంత్రులు అవుతున్నారని నిర్మల చేసిన వ్యాఖ్యల పట్ల తాము కూడా అంగీకరిస్తామని అజేయ కల్లం తెలిపారు.