Varla Ramaiah: సోషల్ మీడియా వంటి చిల్లర కేసులకు ఇచ్చిన ప్రాధాన్యత వివేకా హత్యకేసుకు ఇవ్వడంలేదు: వర్ల రామయ్య
- సీఎం జగన్ కు ప్రశ్నాస్త్రాలు సంధించిన వర్ల
- పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారంటూ వ్యాఖ్యలు
- సీఎం కేంద్రానికి లేఖ రాయాలంటూ డిమాండ్
ఎన్నికల ముందు పులివెందులలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగ్గా, ఇప్పటికీ ఆ కేసులో దోషులెవరన్నది స్పష్టం కాలేదు. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని నాడు శవం పక్కన నిలుచుని అడిగింది మీరే కదా? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. గవర్నర్ ను కలిసి సీబీఐ విచారణకు ఇవ్వాలని కోరలేదా? అని నిలదీశారు.
సీఎం అయ్యాక పిటిషన్ ను వెనక్కి తీసుకోవడానికి గల కారణాలు చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించి 100 రోజులు అయినా దర్యాప్తులో పురోగతి లేదని తెలిపారు. సీబీఐ దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి లేఖ రాయాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వంటి చిల్లర కేసులకు ఇచ్చిన ప్రాధాన్యత వివేకా హత్య కేసుకు ఇవ్వడంలేదని విమర్శించారు.