Corona Virus: భయపడక్కర్లేదు.. మన దేశంలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది: కేంద్రం
- కేంద్ర ఆరోగ్యమంత్రి నేతృత్వంలో కీలక సమావేశం
- హాజరైన విదేశాంగ, పౌర విమానయాన మంత్రులు
- మరణాల రేటు 3 శాతమేనని డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడి
లాక్ డౌన్ ఆంక్షలు బాగా సడలించాక కరోనా వ్యాప్తి తీవ్రరూపు దాల్చింది. ఈరోజుకి దేశం మొత్తమ్మీద 5,08,953 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 15,685 మంది మృత్యువాత పడ్డారు. అయితే, ఈ గణాంకాలు చూసి భయపడవద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సూచించారు. దేశంలో ఐదు లక్షల కేసులు నమోదైన మాట వాస్తవమే అయినా, అందులో 2,95,880 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని, ఇప్పుడు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోంది 1,97,387 మంది మాత్రమేనని స్పష్టం చేశారు.
ముఖ్యంగా, భారీ జనాభా ఉన్న మన దేశంలో కరోనా మరణాల రేటు 3 శాతం మాత్రమేనని వివరణ ఇచ్చారు. దేశంలో కరోనా రికవరీ రేటు 58.13 శాతం అని వెల్లడించారు. పైగా కేసులు రెట్టింపయ్యే కాలం 19 రోజులు అని తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులపై డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా పాల్గొన్నారు.