India: శత్రుభీకర క్షిపణులను సరిహద్దుల్లో మోహరిస్తున్న భారత్
- వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు
- సరిహద్దుల్లో చైనా యుద్ధ విమానాల కదలికలు ముమ్మరం
- సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లను తరలించిన భారత్
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా యుద్ధ విమానాలు, పోరాట హెలికాప్టర్ల కదలికలు తీవ్రతరం అయిన నేపథ్యంలో భారత్ కూడా దీటుగా స్పందిస్తోంది. శత్రుభీకర క్షిపణులను సరిహద్దుల్లో మోహరించింది. వీటిలో సత్వరమే దూసుకెళ్లే భూతలం నుంచి ప్రయోగించే ఎయిర్ మిసైళ్లు ఉన్నాయి. వీటిని కొన్నిరోజుల క్రితమే తూర్పు లడఖ్ సెక్టార్ కు తరలించారు. దీనిపై కేంద్ర వర్గాలు మాట్లాడుతూ, సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్విగ్నభరిత పరిస్థితుల నడుమ భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలను తూర్పు లడఖ్ సెక్టార్ లో మోహరించామని తెలిపాయి.
చైనా ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు కానీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్లు కానీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా, మన రక్షణ వ్యవస్థలు తుత్తునియలు చేస్తాయని అధికారులు పేర్కొన్నారు. తాజాగా మోహరించిన క్షిపణుల్లో ఆకాశ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అమిత వేగంతో కదిలే యుద్ధ విమానాలను కూడా ఆకాశ్ మిస్సైల్ క్షణాల్లో కూల్చివేస్తుంది. క్షిపణుల మోహరింపే కాకుండా, సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాలను కూడా తరలించారు.