India: 110 రోజులకు లక్ష కేసులైతే... ఆపై 33 రోజులకు 3 లక్షలు, ఆరు రోజుల్లోనే మరో లక్ష!

One Lakh New Cases in Just 6 Days

  • శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు
  • రోజుకు 18 వేల కేసులకు పైగా నమోదు
  • లక్షణాలు లేకున్నా శరీరంలో వైరస్
  • టెస్టుల సంఖ్యను పెంచుతుంటే పెరుగుతున్న కేసులు

ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. తొలి కేసు వచ్చిన తరువాత లక్ష కేసులు రావడానికి 110 రోజుల సమయం పడితే, ఆపై 33 రోజులకు మొత్తం కేసుల సంఖ్య 4 లక్షలకు చేరింది. దీని తరువాత కేవలం 6 రోజుల వ్యవధిలోనే మరో లక్ష కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ ను దాటేసింది. శనివారం నాడు 18,552 కేసులు వచ్చాయి. ఇండియాలో ఒక్క రోజులో వచ్చిన కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

అయితే, ఇండియాలో రోజురోజుకూ టెస్టింగ్ సామర్థ్యం పెరుగుతూ ఉండటంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. టెస్ట్ ల సంఖ్య ఎంతగా పెరిగితే, కేసులు అంతగా ఎక్కువవుతాయని, ఎన్నో దేశాల్లో ఇది నిరూపణ అయిందని, లక్షణాలు లేకున్నా వైరస్ ఎంతో మంది శరీరంలో ఉండటమే ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇదే సమయంలో కరోనా వైరస్ సోకి మొత్తం 15,600 మందికి పైగా మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. శనివారం ఒక్క రోజులో 384 మంది మరణించారు. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, పలు రాష్ట్రాలు స్వీయ లాక్ డౌన్ ను విధించుకుంటుండగా, జిల్లా స్థాయిల్లో కలెక్టర్లు నిర్ణయాలు తీసుకుని, కేసులు ఎక్కువగా ఉన్న పట్టణాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News