Telangana: రెండడుగుల కొబ్బరిచెట్టుకు 100కు పైగా కాయలు... తెలంగాణలో సాగు!
- కొబ్బరి సాగును ప్రోత్సహించాలని ఉద్యానవనశాఖ నిర్ణయం
- సహకారాన్ని, రాయితీలను ప్రకటించిన సీపీసీఆర్ఐ
- మంచి ఆదాయాన్ని పొందవచ్చంటున్న అధికారులు
రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులోనే దిగుబడిని అందించే కల్పజ్యోతి, కల్పసూర్య, కేర సంకర తదితర కొబ్బరి రకాలను తెలంగాణలో ప్రోత్సహించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో సాగునీటి వసతులు పెరుగుతున్నందున కొబ్బరి తోటలను విరివిగా సాగు చేయించాలని ప్రభుత్వం నిధులను కేటాయించింది. కేరళలోని సీపీసీఆర్ఐ (కేంద్రీయ మొక్కలు, పంటల పరిశోధనా సంస్థ), తెలంగాణకు అనుకూలంగా ఉన్న కొబ్బరి వంగడాలను సూచించింది. కల్పజ్యోతి నాటితే ఏడాదిలో 144 వరకూ కొబ్బరికాయలు వస్తాయని, కల్పసూర్య వెరైటీతో 123 వరకూ, కేర సంకరకైతే 130 వరకూ కాయలు వస్తాయని, చంద్ర సంకల, కల్ప సంవృద్ధి వెరైటీలు కూడా ఈ ప్రాంతంలో అనుకూలంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
పంట వేసిన తొలి మూడుసంవత్సరాల్లో అంతరపంటలుగా పూలతోటలు, కూరగాయలు సాగుచేస్తూ, ఆదాయం పొందవచ్చని, నాలుగో ఏటి నుంచి ఎకరానికి నికరంగా రూ. 80 వేల వరకూ ఆదాయం వస్తుందని అధికారులు అంటున్నారు. అప్పుడు కూడా అంతరపంటలుగా కోకో వంటివి సాగు చేసి మరో రూ. 60 వేలు పొందవచ్చని తెలిపారు. ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి తదితర జిల్లాల్లో కొబ్బరి సాగుకు నేలలు, వాతావరణం అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,131 ఎకరాల్లో మాత్రమే కొబ్బరి తోటలు ఉండగా, ఈ విస్తీర్ణాన్ని మరింతగా పెంచే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం 10 ఎకరాలకు సరిపోయే మొక్కలను కొనుగోలు చేస్తే, రూ. 7,500 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. పంటకు అవసరమైన తయారీకేంద్రం పెట్టుకోవడానికి అయ్యే వ్యయంలో రూ. 60 వేల రాయితీని కూడా ఇవ్వాలని నిర్ణయించిన సీపీసీఆర్ఐ, ఇప్పటికే రూ. 9.14 లక్షల రాయితీ నిధులను కూడా విడుదల చేసింది.