sushant singh: అలాగైతే సినీ పరిశ్రమలో ప్రతిరోజూ ఇద్దరు ఆత్మహత్య చేసుకునేవారు: శివసేన నేత సంజయ్‌ రౌత్‌

sanjay raut on sushant suicide

  • ఓటమి భయంతోనే సుశాంత్‌ ఆత్మహత్య 
  • సినీ పరిశ్రమ కొంత మంది గుప్పిట్లోనే ఉందనడం సరికాదు
  • ఏ రంగంలోనైనా నెపోటిజం అనేది ఉంటుంది
  • సుశాంత్‌ ఆత్మహత్యను మీడియా వేడుకగా భావిస్తోంది

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకోవడం కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. నెపోటిజంపై బాలీవుడ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండగా ఈ విషయంపై శివసేన కీలక నేత సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ ఓటమి భయంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు తమ పార్టీ పత్రిక సామ్నాలో సంజయ్‌ రౌత్ ఓ కథనం రాసుకొచ్చారు. సినీ పరిశ్రమ కొంత మంది గుప్పిట్లోనే ఉందని చెప్పడం సరైంది కాదన్నారు. ఒకవేళ సినీ పరిశ్రమ కొందరి గుప్పిట్లోనే ఉంటే ప్రతిరోజూ  ఒకరిద్దరు ఆత్మహత్యకు పాల్పడేవారని చెప్పారు. ఏ రంగంలోనైనా నెపోటిజం అనేది ఉంటుందని ఆయన తెలిపారు.

ఉన్నత స్థానాన్ని చేరుకునేందుకు గట్టిగా పోరాడాలని సంజయ్‌ రౌత్ చెప్పారు. సుశాంత్‌ మరణంపై మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడాన్ని మీడియా వేడుకగా భావిస్తూ వార్తలు ప్రసారం చేస్తోందని విమర్శించారు.

దేశంలో రైతు లేక సైనికుడు మృతి చెందితే మాత్రం ఇంతలా ఎందుకు వార్తలు ప్రచురించట్లేదని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా ప్రచారాన్ని నిలిపేయాలని ఆయనకోరారు. లేదంటే ఆత్మహత్యలు వరుసగా జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరిరోజుల్లో సుశాంత్‌ ఒంటరి జీవితాన్ని అనుభవించాడని, దీంతో ఆయన మానసిక పరిస్థితి పాడైపోయిందని చెప్పారు. బాలీవుడ్‌లో ఉన్నతస్థానానికి చేరడం లేదనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News