KP Sharma: సొంతపార్టీలో అసమ్మతి ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాని... అంతా భారత్ చలవేనంటూ ఆరోపణలు
- ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్
- అసమర్థ ప్రధాని అంటూ విమర్శలు
- తనను ఎవరూ తప్పించలేరన్న కేపీ శర్మ ఓలి
ఇటీవలే నేపాల్ మ్యాప్ సవరణలో తన పంతం నెగ్గించుకున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. కేపీ శర్మ ఓలి ఓ అసమర్థ నాయకుడు అంటూ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు ప్రచండ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని కేపీ శర్మ ఓలి స్పందించారు. తన ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర జరుగుతోందని, అందుకు భారత్ ప్రోత్సాహం ఉందని ఆరోపించారు.
ఖాట్మండూలోని భారత రాయబార కార్యాలయంలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని, తనను పదవి నుంచి తప్పించలేరని ధీమా వ్యక్తం చేశారు. నేపాల్ మ్యాప్ ను సవరించి కొత్త మ్యాప్ తీసుకువచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగా పథకాలు రచిస్తున్నారని, కానీ నేపాల్ జాతీయవాదాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారని మండిపడ్డారు. మ్యాప్ తీసుకువచ్చినంత మాత్రాన ప్రధాని పదవి నుంచి వైదొలగాలని తమ నేపాల్ పౌరులు ఎప్పుడూ కోరుకోరని కేపీ శర్మ ఓలి స్పష్టం చేశారు.
భారత్ లో అంతర్భాగంగా ఉన్న లింపియధురా, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను తనవిగా పేర్కొంటూ నేపాల్ ఇటీవలే కొత్త మ్యాప్ తీసుకువచ్చింది. దానికి నేపాల్ పార్లమెంటు కూడా ఆమోదం తెలిపింది. దీనిపై భారత్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, ఆ మూడు ప్రాంతాలు తమవేనని ఉద్ఘాటించింది.