Bihar: వంతెన నిర్మాణ పనుల్లో చైనా కంపెనీల భాగస్వామ్యం.. టెండర్లు రద్దు చేసిన బీహార్ ప్రభుత్వం
- పాట్నాలో మహాత్మాగాంధీ వంతెన నిర్మాణ టెండర్లు రద్దు
- భాగస్వాములను మార్చుకోమని చెప్పినా పెడచెవిన పెట్టిన కాంట్రాక్టర్లు
- గాల్వాన్ ఘటనలో అమరులైన వారిలో ఐదుగురు బీహారీలే
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వంతెన నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు చైనా కంపెనీలతో భాగస్వామ్యం ఉండడంతో ఆ టెండర్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పాట్నాలో ‘మహాత్మాగాంధీ వంతెన’ నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు రెండు చైనా కంపెనీలతో భాగస్వామ్యం ఉంది. దీంతో భాగస్వాములను మార్చుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరింది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు నిరాకరించడంతో ప్రభుత్వం తాజాగా ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి నంద్‌కిశోర్ యాదవ్ తెలిపారు.
ఈ నెల 15న లడఖ్‌లోని గాల్వన్‌లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చనిపోయిన వారిలో ఐదుగురు బీహార్‌కు చెందిన వారే. చైనా తీరుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. వంతెన టెండర్‌ను రద్దు చేసిన ప్రభుత్వం త్వరలోనే గతంలో చైనాతో కుదుర్చుకున్న ఇతర ఒప్పందాలను కూడా రద్దు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.