Singapore: సింగపూర్ నుంచి చెన్నైకి ప్రత్యేక విమానం.. అందులో ఒకే ఒక్కడు!
- సింగపూర్ నుంచి 145 మందితో బయలుదేరిన విమానం
- కోల్కతాలో 144 మంది దిగిపోయిన వైనం
- చెన్నైలో స్వాగతం పలికేందుకు వచ్చి విస్తుపోయిన అధికారులు
‘వందేభారత్ మిషన్’లో భాగంగా సింగపూర్ నుంచి కోల్కతా మీదుగా చెన్నై వచ్చిన విమానం నుంచి దిగిన ఒకే ఒక్క ప్రయాణికుడిని చూసి అధికారులు విస్తుపోయారు. సింగపూర్ నుంచి భారతీయులతో బయలుదేరిన ప్రత్యేక విమానం శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కోల్కతా మీదుగా చెన్నై చేరుకుంది. ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు అప్పటికే అక్కడ విమానాశ్రయ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే, విమానం నుంచి ఒకే ఒక్క ప్రయాణికుడు దిగడంతో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
40 ఏళ్లున్న వ్యక్తి విమానం దిగి నెమ్మదిగా నడుచుకుంటూ అధికారుల వద్దకు వచ్చాడు. తేరుకున్న అధికారులు విషయం ఆరా తీశారు. విమానం సింగపూర్ నుంచి 145 మంది ప్రయాణికులతో బయలుదేరిందని, వారిలో 144 మంది కోల్కతాలో దిగిపోయారని చెప్పాడు. తన ఒక్కడితోనే విమానం చెన్నై బయలుదేరిందని చెప్పడంతో అధికారులు షాకయ్యారు. ఆ తర్వాత అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్లో ఉండాలని సూచించి పంపేశారు. కోల్కతా నుంచి ఒక్కడితోనే విమానం చెన్నైకి రావడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.